Posted by CityPolice-Admin on 2026-03-24 11:16:48 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఈనాడు, హైదరాబాద్: ఎంతోమంది జీవితాలను కాటేస్తున్న కల్తీ కల్లు కట్టడికి కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టంచేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు బారినపడి చాలా మంది ఆసుపత్రిపాలయ్యారు. నిందితులను అరెస్టు చేసి, ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నుంచి నిజామాబాద్ జిల్లాలోని 104 గ్రామాల్లో టీజీన్యాబ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రాంగణంలో మంగళవారం సంబంధిత గోడ పత్రికలు, ప్లకార్డులను సందీప్ శాండిల్య ఆవిష్కరించారు. 26 మండలాల్లో సదస్సులు నిర్వహించేందుకు 26 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత రాష్ట్ర సాధనలో పౌరులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీజీన్యాబ్ ఒక్కో బృందం స్థానిక ప్రభుత్వ వైద్యాధికారులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలసి 4 గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి కల్తీ కల్లుతో తలెత్తే అనర్థాలను వివరిస్తుందన్నారు. యువతకు క్రీడాసామగ్రి పంపిణీ చేస్తామని.. వారినే 'యాంటీ డ్రగ్ సోల్జర్స్'గా తయారు చేస్తామని చెప్పారు. అల్ఫాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1908, కంట్రోల్ రూం నంబర్ 87126 71111 లకు తెలియజేయాలని కోరారు.
డీఐజీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు