Posted by CityPolice-Admin on 2026-03-24 12:50:47 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
దిల్లీ: దేశవ్యాప్తంగా మూడేళ్లలో 13 లక్షలకు పైగా అమ్మాయిలు, మహిళలు (Women Missing) అదృశ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. 2019 నుంచి 2021 వరకు మధ్యప్రదేశ్లో సుమారు 2 లక్షల మంది ఆచూకీ లేకుండా పోగా.. పశ్చిమ బెంగాల్లోనూ దాదాపు అదే సంఖ్యలో అమ్మాయిలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా అదృశ్యమైన వారిలో 10.61 లక్షల మంది 18ఏళ్లకుపైగా ఉన్నవారు ఉండగా. 2.51లక్షల మంది బాలికలు ఉన్నట్లు ఇటీవల పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో కేంద్ర హోంశాఖ (Home Ministry) తెలిపింది.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం, మధ్యప్రదేశ్లో మూడేళ్ల కాలంలో 1.60లక్షల మహిళలు, 38 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు. పశ్చిమ బెంగాల్లోనూ 1.56 లక్షల మంది మహిళలు, 36వేల మంది బాలికలు తప్పిపోయారు.
మహారాష్ట్రలో 1.78లక్షల మంది మహిళలు, 13వేల మంది అమ్మాయిల ఆచూకీ లేకుండా పోయినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఒడిశాలో 70వేల మంది మహిళలు, 16వేల మంది బాలికలు అదృశ్యమైనట్లు తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల విషయానికొస్తే.. ఢిల్లీలో అత్యధికంగా ఈ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 61వేల మంది స్త్రీలు, 22వేల మంది బాలికలు తప్పిపోయారు. జమ్మూ కశ్మీర్లో 8617 మంది మహిళలు, 1148 మంది బాలికలు అదృశ్యమైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం కాగా వీరిలో 56,773 మంది మహిళలు, 15,994 బాలికలు ఉన్నారు.