Posted by CityPolice-Admin on 2026-03-24 12:53:53 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
మారేడుమిల్లి, న్యూస్టుడే, నిత్యం చదువులతో నిమగ్నమైన ఆ విద్యార్థులు ప్రకృతి ఒడిలో గడపాలని విహారయాత్రకు వచ్చారు. ఉత్సాహంగా అక్కడి జలపాతంలో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉదృతంగా ప్రవహించి అయిదుగురు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరిని అక్కడున్నవారు కాపాడగా.. ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో చోటుచేసుకుంది. స్నేహితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 16 మంది వైద్యవిద్యార్థులు ట్రావెలర్ వాహనంలో ఆదివారం వచ్చారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట రహదారిలోని 'జలతరంగిణి జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉదృతి పెరగడంతో అయిదుగురు కొట్టుకుపోయారు. అందులో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరిని ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీహెచ్. హరదీప్ (20), విజయనగరానికి చెందిన కౌసిరెడ్డి సౌమ్య (21), బాపట్లకు చెందిన బి అమృత (21) ఉన్నారు. పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన కొసిరెడ్డి సౌమ్య స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం రావువారి వీది కుమార్తె గల్లంతైన సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అప్పలనాయుడు, రమ ఆందోళనతో వాగు వద్దకు పయనమయ్యారు.