Posted by admin on 2024-09-12 06:03:08 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 77
ఒక పార్టీలో గెలవడం.. ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే.. అధికార పార్టీలోకి జంప్ అయిపోవడం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రాజకీయ క్రీడ. పార్టీ అధికారంలో ఉన్నపుడు అవతలి పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవం ద్వారా తాము బలోపేతం కావడంతో పాటు అవతలి పార్టీని ఇంకా చెప్పాలంటే, ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా పాలన సాగించాలనుకో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులను తన పార్టీలో చేర్చుకుని.. ఆయా పార్టీల మనుగడ దెబ్బతీయాలని ప్రయత్నించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ విపక్షంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్ ను విచారణకు సవీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కు సూచించింది. ఒకవేళ ఆలోగా చర్యలు తీసుకోకపోతే కనుక తాము సుమోటోగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి ఎటువంటి పంథా అవలంభిస్తారు? అసలు ఆయన ముందు ఉన్న ఆప్షన్స్ ఏమిటి? ఒకసారి చూద్దాం.
బీఆర్ఎస్ ను చీల్చడం..
Revanth Reddy: ప్రస్తుత అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలలో వాస్తవంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన వారు 38 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఈ పదిమంది విషయంలోనే రచ్చ జరుగుతోంది. వీరిపై అనర్హత వేటు పడకూడదు అంటే.. బీఆర్ఎస్ నుంచి మరో 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలి. అలా చేర్చుకోగలిగితే, బీఆర్ఎస్ పార్టీ చీలిపోయినట్టవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 16 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం నెలరోజుల్లో ఇప్పటికే పార్టీ దూకిన ఎమ్మెల్యేలపై ఎదో ఒక నిర్ణయం వెలువర్చాల్సిన పరిస్థితి ఉంది. ఇంత తక్కువ సమయంలో మరో 16 మంది ఎమ్మెల్యేలను పార్టీ దాటించడం ప్రాక్టికల్ గా సాధ్యం అయ్యే పని కాదు. కానీ, అధికార పక్షం కనుక ఏదైనా ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఒకవేళ రేవంత్ రెడ్డి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి 16 మందిని బీఆర్ఎస్ నుంచి బయటకు తెచ్చి ఆ పార్టీని చీలిస్తే అది గొప్ప రాజకీయ విజయం అవుతుంది. ఇంకా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చినట్లు కూడా అవుతుంది. ఇదే జరిగితే గతంలో ఏ అస్త్రంతో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ దెబ్బకొట్టిందే.. ఇప్పుడు అదే అస్త్రంతో రివేంజ్ తీసుకున్నట్లు కూడా అవుతుందన్న చర్చ సాగుతోంది. అయితే.. ఇది సాధ్యం అవుతుందా? లేదా? అన్నది తేలాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.
జంప్ అయిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం..
Revanth Reddy: బీఆర్ఎస్ ను చీల్చడం సాధ్యం కాకపొతే, కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలకు వెళ్లడం ఒక మార్గం. కానీ, ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్నికలకు సిద్ధంగా ఉంటారనేది అనుమానమే. ఎందుకంటే, ఇప్పుడు ఎన్నికల ఖర్చు భరించడం సాధ్యమయ్యే పని కాదు. ఏడాది తిరక్కుండానే మళ్ళీ ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది కూడా కాంగ్రెస్ ను కలవర పెట్టే అంశం. అందుకని ఈ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మళ్ళీ ఎన్నికలకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తే.. ఇప్పటికే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఎలాగైనా మళ్ళీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా తమ పార్టీని వదిలి పెట్టి కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకులను ఓడించాలనేది బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గూటికే చేరుతారనే ఒక అంచనా కూడా వెలువడుతోంది. వారిని ఆపడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ పదిమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి గనుక రాజీనామాలు చేయించి.. వారిని ఎన్నికల్లో గెలిపించుకుంటే అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ఏకఛత్రాధిపత్యం సాధించే అవకాశం ఆయనకు ఉంటుంది. కానీ, అది సాధ్యమయ్యే పనేనా అనేది పెద్ద ప్రశ్న!
ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి సొంత పార్టీకి వెళ్లిపోయేలా చేయడం..
Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తిరిగి సొంత పార్టీకి వెళ్లేలా ప్రోత్సహించడం ఒక మార్గం. అలా చేస్తే రాజకీయం అది రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. అధిష్టానం దృష్టిలోనూ ఆయన ప్రతిష్ట మసక బారుతుంది. అయితే, రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేసినా చేయకపోయినా ఈ పదిమంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా తమ పూర్వాశ్రమానికి వెళ్లిపోవడానికి ఇప్పటికే రంగ సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. అదే నిజమైతే ఫిరాయింపుల కేసు ఉండకుండా పోతుంది. అది రేవంత్ రెడ్డికి రాజకీయంగా మచ్చ పడేలా చేస్తుంది.
సాగదీయడం..
ఇప్పుడు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కోర్టులో అప్పీల్ చేయడం.. అలా కేసును కొన్నిరోజుల పాటు వాయిదా వేస్తూ వెళ్లడం ద్వారా టైమ్ కిల్ చేయడం. తిరిగి ఎన్నికలు వచ్చేవరకూ ఈ కేసును రకరకాల కోర్టుల దగ్గరకు తీసుకువెళ్లి సమస్యను నాన్చుతూ పోవడం. ఇది కూడా అంతగా చెప్పుకోవలసిన మార్గం కాదు. కానీ, ఇక ఏ దారీ లేని పరిస్థితిలో చివరి మార్గంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ దారిని ఎంచుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
మొత్తమ్మీద చూసుకుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు సిసలు రాజకీయ పరీక్ష కోర్టు ఆదేశాల నేపథ్యంలో వచ్చినట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కోర్టు ఇచ్చిన సమయం తక్కువగా ఉండడం.. ఆ సమయం మించిపోతే సుమోటోగా తామే విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు చెప్పడంతో రాజకీయంగా కలకలం మొదలైంది. ఒక పక్క బీఆర్ఎస్ ఉప ఎన్నికల కోసం తొడలు కొడుతోంది. దీంతో రేవంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.