Posted by admin on 2024-09-12 08:08:39 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 66
Andhra Pradesh: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోతున్నది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కింద ఉన్న కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు. ఈ ప్రమాదంలో మరి కొంద మంది గల్లంతయినట్లు తెలుస్తుంది.
వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్‌ఐ ఆధ్వర్యంలోని బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టింది. కాగా, సీలేరు ఘాట్ రోడ్డులోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే నర్సీపట్నం-భద్రాచలం అంతర్రాష్ట రహదారిలో దాదాపు 16 కిలోమీటర్ల మేర పలుచోట్ల కొండచరియలు విరిగి పడడంతో హైవేపై బురద, రాళ్లు పేరుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది.