Posted by pallavi on 2024-09-13 10:44:19 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 107
సీపీఐ (ఎం) అగ్రనేత సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరి మరణం వల్ల కేవలం కమ్యూనిస్టు శ్రేణుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో కూడా విషాదం నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ భావోద్వేగపూరితంగా స్పందించారు. "ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గల సీపీఐ (ఎం) అగ్రనేత సీతారాం ఏచూరి గారి మరణం నాకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి, ఆయన ఎప్పుడూ సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అణగారిన వర్గాల కోసం పనిచేశారు.
ఆయన కుటుంబానికి, అభిమానులకు, సీపీఐ (ఎం) పార్టీకి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రజాసేవకు, దేశానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆయన లేకపోవడం చాలా బాధాకరం" అని చిరంజీవి పేర్కొన్నారు.