Posted by pallavi on 2024-09-13 11:16:33 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 129
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో ఈరోజు పార్టీ సమావేశానికి బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని, బీఆర్ఎస్ నేతలను అన్ని చోట్ల అరెస్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నిన్న బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా?" అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేకపోవడం పట్ల ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు. "ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని" కేటీఆర్ మండిపడ్డారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. "దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని" కేటీఆర్ ఆరోపించారు. "అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు."