పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి మధ్య భేటీ: వరద బాధితులకు కోటి రూపాయల విరాళం

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్

Posted by pallavi on 2024-09-13 11:36:01 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 44


పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి మధ్య భేటీ: వరద బాధితులకు కోటి రూపాయల విరాళం

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాధితుల సహాయార్థం రూ. కోటి విరాళం ఇచ్చినట్లు పవన్ ప్రకటించారు. ఆ విరాళానికి సంబంధించిన చెక్కును నేడు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి తో పాటు కొన్ని కాంగ్రెస్, జనసేన నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరియు ఇతర అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

ఇటీవలి భారీ వర్షాల కారణంగా తెలంగాణలో మున్నేరు వాగు, ఏపీలో బుడమేరు పొంగిపోయాయి. మున్నేరు ఖమ్మంను ముంచెత్తగా, బుడమేరు విజయవాడను ముంచేసింది. ఈ వరదలతో పలు ప్రాణనష్టం సంభవించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో, వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు తన సొంత నిధుల నుంచి పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. కోటి విరాళం ఇచ్చారు.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీకి ఇచ్చిన రూ. కోటి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు. అలాగే, వరద ముంపునకు గురైన గ్రామాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణకు కూడా కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్, ఈ విరాళానికి సంబంధించిన చెక్కును బుధవారం రేవంత్ రెడ్డికి అందజేశారు.

Search
Categories