Posted by pallavi on 2024-09-13 12:20:56 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 86
గాజా: హమాస్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో దాడులు చేస్తున్నది. దక్షిణ గాజా స్ట్రిప్‌లో జరిగిన వైమానిక దాడుల్లో 40 మంది మృతిచెందగా, 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయాలపాలయ్యారు. ఖాన్ యునిస్ మరియు అల్-మవాసి ప్రాంతాల్లోని నిరాశ్రయ జోన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం గతంలో ఈ ప్రాంతాలను సురక్షితమైన జోన్‌గా ప్రకటించి, ఎలాంటి దాడులు జరగబోనని చెప్పింది. అయినప్పటికీ, ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు హమాస్ కమాండ్ సెంటర్‌పై మాత్రమే చేశామని పేర్కొంది. గాజా స్ట్రిప్లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు మరియు సైన్యంపై వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందుకే ఈ దాడులు చేశామని పేర్కొంది.
దాడి రాత్రిపూట జరిగినదిగా, 40 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించామనీ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. స్థానిక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలకు దాడులపై ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని, దీనివల్ల చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 15 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.