Posted by pallavi on 2024-09-13 20:07:03 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 65
ధైర్యం, సాహసం, ధిక్కార స్వభావం, గొప్ప వ్యక్తిత్వం, స్థిరమైన ఆత్మస్థైర్యం, సమసమాజం—ఈ గుణాలు అన్నింటికీ ప్రతీక చాకలి ఐలమ్మ. ఆమె జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకం. బడిముఖం కూడా చూడని ఈ మహనీయురాలి పేరు కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి అలంకారంగా నిలవబోతోంది. ఈ సందర్భంగా ఆమె మునిమనుమరాలు, చిట్యాల శ్వేతా ఐలమ్మను ‘నవ్య’ పలకరించింది.
“చాకలి ఐలమ్మ రక్తం పంచుకొని పుట్టినవారు మాత్రమే కాదు, అన్యాయాన్ని ధిక్కరించే వారంతా ఆమెకు వారసులే. చిట్యాల ఐలమ్మకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక కొడుకును రజాకార్లు పొట్టనపెట్టుకొన్నారు. మిగిలిన వారందరిలో ఆమె పెద్దకుమారుడు సోమయ్యకు చిన్న కొడుకైన రామచంద్రం ఒక్కరే తన నాయనమ్మ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొన్నారు. అతను ఐలమ్మ దగ్గరే పెరిగి పెద్దయ్యారు. ఆమె ఆదర్శాలను అనుసరించారు. సీపీఎం స్థానిక నాయకుడిగా, 20 ఏళ్ల పాటు పాలకుర్తి సర్పంచ్‌గా పుట్టినగడ్డకు చాలా మంచి పనులు చేశారు. గ్రంథాలయం నిర్మించారు, పేదలకు ఇళ్లను మంజూరు చేశారు, ఊరుకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. నేను ఆ రామచంద్రం గారి చిన్న కొడుకు సంపత్‌కుమార్ భార్యను. 2007లో చిట్యాల వారింట అడుగుపెట్టాను. గొప్ప చరిత్ర కలిగిన కుటుంబానికి కోడలిగా వచ్చానని తెలియదు. ఒకసారి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మామయ్య వెంట నేను కూడా వెళ్లాను. ఆ వీరనారి ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రజలంతా కీర్తించడం విని, ‘‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు?’’ అని గర్జించిన ఐలమ్మ జీవితం నన్ను కదిలించింది. ఆ స్ఫూర్తితోనే నా పేరును ‘శ్వేత ఐలమ్మ’గా మార్చుకున్నాను. నా వంతు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజాజీవితంలోకి వచ్చాను. ప్రతి సంవత్సరం ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను."
"కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం, ఆమెకు ఘనమైన నివాళి. ఆమె చరిత్ర తరతరాలకు తెలిసేలా ఇలా మంచి నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఐలమ్మకు వారసులుగా మాకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించిందీ ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం ఐలమ్మ పేరును ఉపయోగించుకున్నారు. మా కోడలు ఐలమ్మ వారసులుగా గుర్తింపు మాత్రమే కోరుకున్నాము. ఆ గుర్తింపు ఇన్నాళ్లకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దీనిని పదవి లేదా హోదా అనుకోకుండా, బాధ్యతగా భావించి నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తాను."
"ఐలమ్మకు భయమనేది తెలియదు. ఆమె వృత్తి చేయడం ఇష్టంలేక Nagali పట్టింది. కౌలు రైతుగా మారింది. స్వాభిమానానికి ప్రతీకగా ఉన్న ఐలమ్మను చూసి విస్నూరు దొరకు కడుపు మండింది. దొరలకు వ్యతిరేకంగా గొంతెత్తిన ఆమెకు 200మంది గూండాలను పంపించి, ఇంటి మీద పడి గొర్రెలు, మేకలు, పశువులు అన్నింటినీ తోయించుకున్నారు. అన్నం కుండలు, నీటి తొట్టెలతో సహా వస్తువులన్నిటిని ధ్వంసం చేశారు. ఆమె కూతురిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భర్తను, కొడుకును కోల్పోయినా, ఆ యోధురాలు అడుగు వెనక్కివేయలేదు. తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. రోకలి బండ చేతపట్టి దొరలు, దేశ్‌ముఖ్ల మోచేతినీళ్ళు తాగే గూండాలను పరుగులు తీయించింది. ఆమెకు భయమనేది తెలియదు. కోర్టు విచారణకు పాలకుర్తి నుంచి హైదరాబాద్ కాలినడకన వెళ్లి వచ్చేదని తెలిసి ఆశ్చర్యం కలిగింది. పోరాట పటిమ, తెగువ, ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాల్లో మనమంతా ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి.”