Posted by pallavi on 2024-09-13 21:12:00 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 40
చింతూరు మండలంలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రానికి ఆంధ్ర ఒడిస్సాల నడుమ రాకపోకలు లేకుండా పోయాయి. నిమ్మలగూడెం, కుయుగూరుల నడుమ 30వ నెంబరు జాతీయ రహదారిపై ఇంకా వరద తగ్గకపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వరరామచంద్రపరం మండలాల పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. చీకటివాగు, చంద్రవంక వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు పూర్తిగా తగ్గలేదు. దీంతో ఆ దిశగా కూడా రాకపోకలు స్తంభించాయి. వరద తగ్గిన రహదార్లన్నీ బురదతో నిండిపోయాయి. పాడేరు, రంపచోడవరం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహకారంతో బురద తొలగించే పనిలో ఉన్నారు. తాజా వరద కారణంగా చింతూరు డివిజన్‌లో 19,766 కుటుంబాలు వరదబారిన పడ్డట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది.
పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే శిరీషదేవి
కూనవరం: పోలవరం ముంపు మండలాలకు త్వరలో పరిహారం అందేలా చేస్తానని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి అన్నారు. మండలంలో పర్యటించి బొజ్జరాయిగూడెం, తాళ్లగొమ్ము, కోతులగుట్ట పునరావాస కేంద్రాలు, టేకులబోరు విజయభాస్కరకాలనీ, కూనవరం గిన్నెల బజారులోని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడతలపించారు. అనంతరం కూనవరం యువత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం తెలుగుయువత అధ్యక్షుడు మఠంభాస్కర్, బరపాటి ప్రకాశరావు, అరకు పార్లమెంటు ప్రతినిధి ఎడవిల్లి భాస్కరరావు, చెలకాని ఉమామహేశ్వరరావు, పాయం వెంకయ్య, నోముల సత్యనారాయణ, రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
వరద బాధితులకు కిట్లు పంపిణీ
వరరామచంద్రాపురం, సెప్టెంబర్ 13: మండలంలోని నాలుగు గ్రామాల వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. వరద ముంపు గ్రామాలలోని 284 కుటుంబాలకు ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబు ఆధ్వర్యంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి 1,200 రూపాయలు విలువైన కిట్లను అందించారు. ఈ క్రమంలో వరద బాధితులు పోలవరం పరిహారం అందించాలని ఎమ్మెల్యేను కోరారు. ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంత పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్బారావు, ఎంపీడీవో ఫణీంద్ర, సీఐ కన్నపు రాజు, ఏఎస్‌ఐ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.