Posted by pallavi on 2024-09-16 11:27:29 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 75
అమరావతి: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు, అద్వానీ దేశం పట్ల ఎనలేని అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని, తనకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. అద్వానీ చూపే ఆప్యాయత ప్రతిఒక్కరిపై చెరగని ముద్ర వేశిందని పేర్కొన్నారు. అంతేకాక, అద్వానీతో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా చంద్రబాబు షేర్ చేశారు.
అద్వానీకి భారత రత్న అవార్డు రావడం ఎంతో హర్షణీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అద్వానీ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, కష్టపడి, నిబద్ధతతో పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారని అచ్చెన్నాయుడు అభినందించారు. కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధాని హోదాలో అద్వానీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, 2004 తరువాత ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్‌లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.